NTR a biopic book

ఒక  శక్తిగా, వ్యవస్థగా ఎదిగి ప్రజల మనసుల్లో ఒక ప్రగాఢమైన ముద్రను వేసిన  వ్యక్తి చరిత్రను అక్షరబద్ధం చేసినప్పుడు  దాన్ని చదువుతున్న పాఠకుడుకి ఆ వ్యక్తి యొక్క మహోన్నత వ్యక్తిత్వము, కార్యదక్షత, నిష్పాక్షిక వ్యవహార శైలి కళ్ళ ముందు సాక్షాత్కరించాలి. అలాంటి గొప్ప ప్రయత్నమే
“ఎన్టీఆర్ ఏ బయోగ్రఫీ” అనే పుస్తకం.

జాతీయ అంతర్జాతీయ పాఠకులను దృష్టిలో పెట్టుకొని ఆంగ్లంలో రచించిన ఈ పుస్తకం జనవరి 27న మార్కెట్లోకి విడుదలైంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, సకల జన సంక్షేమాభిలాషి  ఎన్.టి.రామారావు పట్ల ప్రతిఫలాపేక్షలేనిప్రేమ,అభిమానం
కఠోర శ్రమ,అంకిత భావాలతో చేసిన  గొప్ప ఆవిష్కరణ ఈ గ్రంధం.

ఎన్నెన్నో గొప్ప లక్షణాలను , సద్గుణాలను తన వ్యక్తిత్వంలో  నింపుకున్న నిండైన  వ్యక్తిత్వ సౌధం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు. ఆయన జీవిత చరిత్రను అక్షరబద్ధం చేయాలి అని సంకల్పించి ఆ బృహత్తర సంకల్పాన్ని  ఆద్యంతం ఆసక్తిదాయకంగా మలిచారు ఆలిండియా సర్వీసెస్ నుండి రిటైర్ అయిన ఇద్దరు ఉన్నతాధికారులు.  వారిలో ఒకరు “రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ కే. చంద్రహాస్ IRS  " గారు కాగా మరొకరు "ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫౌండర్ డైరెక్టర్" - డాక్టర్ కే.లక్ష్మీనారాయణ IAS గారు.

తమ సుదీర్ఘమైన బ్యూరోక్రటిక్ లైఫ్ లో  ఎందరెందరో రాజకీయ ప్రముఖులతో పరిచయాలు, సాన్నిహిత్యాలు కలిగి ఉన్నప్పటికీ సుప్రసిద్ధ నటులు, దర్శక నిర్మాత అయిన ఎన్టీరామారావు పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానంతో ఆయన జీవిత చరిత్రను అక్షరబద్ధం చేశారు ఈ విశ్రాంత ఉన్నతాధికారులు.
  NTR -A Biography - అనే టైటిల్ తో వీరిద్దరూ కలిసి  చేసిన ఈ సంయుక్త రచన, సమిష్టి కృషి 636 పేజీల సమగ్ర  గ్రంథంగా రూపొందింది. క్రీడా, రాజకీయ, సినీ రంగాలకు చెందిన  చాలా మంది ప్రముఖుల జీవిత చరిత్రలు బయోపిక్ ల రూపంలో పుంఖానుపుంఖాలుగా వస్తున్న రోజులివి.  ఎన్టీ రామారావు జీవిత చరిత్ర కూడా రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. 


Other film news